కలం, వెబ్డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ప్రతినిధులతో మూడోసారి కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. కేంద్రం విజ్ఞప్తి మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు విరమిస్తున్నామని ప్రకటించారు.
విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని, ఈ హామీలపై మంగళవారం లోపు లిఖిత పూర్వక హామీ ఇస్తామని చెప్పారని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు. తమ డిమాండ్లు ఏమీ దేశానికి నష్టం కలిగించేవి కాదన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నిబంధనలతకు లోబడే పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఈ నిరసనల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని తెలిపారు. దీనిపై త్వరలో పోలీసులతో మాట్లాడతామని చెప్పారు. అలాగే సీజేపీ ప్రతిపాదించిన సంస్కరణలను పరిశీలిస్తామని నడ్డా తెలిపారు.

