కలం, ఖమ్మం బ్యూరో : సౌర విద్యుత్ వినియోగంతో రైతులకు సమృద్ధిగా సాగునీరు అందడమే కాకుండా, గృహ లబ్ధిదారులకు ఉచిత విద్యుత్‌తో పాటు అదనపు రాబడి సమకూరుతోందని రెడ్కో వైస్ చైర్మన్ అండ్ ఎండీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు. ఆయన ఖమ్మం కలెక్టర్ దివాకర, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డితో కలిసి ఖమ్మం (Khammam) జిల్లా బోనకల్ మండలంలో శనివారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు.
ఈ పర్యటనలో భాగంగా గార్లపాడు గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ పంప్‌సెట్ పనితీరును ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. నేరుగా రైతుతో మాట్లాడుతూ.. సోలార్ పంప్‌సెట్‌తో అందుతున్న నీటి పారుదల, వినియోగంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. సోలార్ విద్యుత్‌తో ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా పంటలకు నిరంతరం నీరందుతోందని, ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటు పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని సదరు రైతు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం అధికారులు రావినూతల గ్రామానికి చేరుకుని, గృహావసరాల కోసం ఇంటిపై ఏర్పాటు చేస్తున్న రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను పరిశీలించారు. లబ్ధిదారునితో మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగంతో గృహ విద్యుత్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా, మిగులు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం కూడా లభిస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ తో పాటు ఆర్థిక పరిపుష్టికి అందిస్తున్న ప్రోత్సాహంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో రెడ్కో ఉన్నతాధికారులు, ఖమ్మం సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస చారి, ఇతర విద్యుత్, రెడ్కో శాఖల అధికారులు పాల్గొన్నారు.

