కలం డెస్క్ : రాష్ట్రాలు ఆర్థికంగా (Economy) ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వివిధ రంగాల్లో అభివృద్ధికి వనరులు తక్కువైనప్పుడు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కోరుకోవడంలో భాగంగా మొదలైన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (Global Summit) లు నిర్వహించడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. ప్రతి ఏటా దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో ఇలాంటి సమ్మిట్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఒక రాష్ట్రంతో మరొకటి పోటీ పడేలా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) నిర్వహించే సమ్మిట్‌లలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రాలు ఆకర్షిస్తున్నాయి. దీని స్ఫూర్తితో సొంతంగా ఆయా రాష్ట్రాల్లోనూ ఇలాంటి సమ్మిట్‌లు నిర్వహిస్తూ పారిశ్రామికంగా, ఆర్థికంగా బలోపేతం కావడానికి చొరవ తీసుకుంటున్నాయి.
సమ్మిట్‌కు నాంది పలికిన గుజరాత్ :
గుజరాత్‌లోని భుజ్‌లో (Bhuj Earthquake) 2001లో రిపబ్లిక్ డే రోజున వచ్చిన భారీ భూకంపంతో ఆ ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారు. బాధితులను ఆదుకోడానికి రాష్ట్రానికి తగిన ఆర్థిక వనరులు లేవు. ఆ తర్వాతి సంవత్సరం ఫిబ్రవరిలో గుజరాత్ అల్లర్లతో (Gujarat Riots) దేశవ్యాప్తంగానే ఆ రాష్ట్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు ఆర్థిక వనరులు మరోవైపు రాష్ట్ర ఇమేజ్ ప్రశ్నార్థకంగా మారడంతో దాన్నుంచి బైటపడడానికి 2003లో దేశంలోనే ఫస్ట్ టైమ్ వైబ్రెంట్ గుజరాత్ (Vibrant Gujarat) గ్లోబల్ సమ్మిట్‌ను అప్పటి ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నిర్వహించారు. అప్పటికే దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు వేగవంతమయ్యాయి. ప్రైవేటు పెట్టుబడిదారులకు భూముల కేటాయింపు, విద్యుత్ ఛార్జీలు, నీటి సరఫరా, అనుమతుల్లో అనేక రాయితీలిచ్చి వారి పరిశ్రమలను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. పారిశ్రామికంగా గుజరాత్ దూసుకుపోవడానికి ఆ సమ్మిట్ దోహదపడింది.
ఆ బాటలోనే ఇతర రాష్ట్రాలు సైతం :
వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో నాలుగేండ్లకు (2007లో) పంజాబ్ (Punjab) సైతం ప్రోగ్రెసివ్ పంజాబ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించింది. స్వల్ప మొత్తంలోనే పెట్టుబడులు వచ్చినా కొన్ని కొత్త పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమమైంది. దానికి కొనసాగింపుగా 2010లో బెంగాల్ లీడ్స్ (Bengal Leads – Bengal Global Business Summit) పేరుతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సమ్మిట్ నిర్వహించింది. 2012లో మధ్యప్రదేశ్ సైతం ‘బిమారు’ (Bihar, Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh) ముద్రను తొలగించుకోడానికి సమ్మిట్ నిర్వహించింది. రాష్ట్రంలో సమ్మిట్‌లు నిర్వహించిన అనుభవంతో, ఫలితాలతో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జాతీయ స్థాయిలో 2015లో ఇదే తరహా సమ్మిట్‌ను నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా రాష్ట్రాలు సమ్మిట్‌లను నిర్వహించడం ఒక రెగ్యులర్ ప్రాక్టీసుగానే కొనసాగుతున్నది.
అత్యధిక పెట్టుబడులు ఉత్తరప్రదేశ్‌కు :
అనేక రాష్ట్రాలు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లు నిర్వహిస్తూ ఉన్నా ఇప్పటివరకు అత్యధిక పెట్టుబడులు వచ్చింది మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే. పలు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఢిల్లీ నగరాన్ని ఆనుకుని ఉండడం, ఎక్కువ జనాభా, ఎక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం కావడంతో పెట్టుబడులు కూడా గణనీయంగా వచ్చాయి. రెండేండ్ల క్రితం నిర్వహించిన సమ్మిట్‌లో ఏకంగా రూ. 33.50 లక్షల కోట్ల ఇన్వెస్టుమెంట్లు వచ్చాయి. గతేడాది డిసెంబరులో రాజస్థాన్ నిర్వహించిన సమ్మిట్‌లో యూపీకంటే ఎక్కువ పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు (రూ. 35 లక్షల కోట్లు) కుదిరినా కొన్ని కార్యరూపం దాల్చలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎప్పుడు సమ్మిట్‌లు నిర్వహించాయో చూద్దాం.
సులభ వాణిజ్య విధానంతో రాష్ట్రాల పోటీ :
దేశ, విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు రావడానికి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB – సులభతర వాణిజ్యం) అనే విధానానికి శ్రీకారం చుట్టింది. కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను నెలకొల్పితే పెట్టుబడిదారులు వస్తారని ఛార్ట్ ను రూపొందించింది. అందులో సంస్కరణలను ప్రవేశపెట్టింది. అమలు చేసిన రాష్ట్రాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఈ ర్యాంకింగ్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. కరెంటు కోతలు లేకుండా, నీటికి తిప్పలు లేకుండా రాష్ట్రాలు చొరవ తీసుకున్నాయి. అదే సమయంలో కేంద్రం సైతం సంక్లిష్ట పన్నుల విధానానికి స్వస్తి పలికి జీఎస్టీని అమలులోకి తెచ్చింది. మేకిన్ ఇండియా, పరిశ్రమల స్థాపనలో రాయితీలు, అనుమతుల్లో వేగం.. ఇలాంటివన్నీ గ్లోబల్ సమ్మిట్(Global Summit)ల ద్వారా రాష్ట్రాలు భరోసా కల్పించాయి.
రైజింగ్ విజన్‌తో తెలంగాణ సమ్మిట్(Global Summit) :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైజింగ్ విజన్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నది. రెండు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సమ్మిట్‌లో దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశమున్నదని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, కొరియా, యూఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాల నుంచి ఇన్వెస్టర్లు ఈ సమ్మిట్‌కు హాజరవుతున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సైతం వర్చువల్‌గా హాజరవుతున్నారు. రానున్న 22 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరిస్తుందని, దానికి తగిన వ్యూహాలు ప్రాక్టికల్‌గా ఉన్నాయని ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్లకు డాక్యుమెంట్ ఆవిష్కరణతో భరోసా కలిగించనున్నది.
సంవత్సరం రాష్ట్రం సమ్మిట్ పేరు
2003 గుజరాత్ వైబ్రాంట్ గుజరాత్
2007 పంజాబ్ ప్రోగ్రెసివ్ పంజాబ్
2010 పశ్చిమబెంగాల్ బెంగాల్ లీడ్స్
2012 మధ్యప్రదేశ్ మాగ్నిఫిషియెంట్ మధ్యప్రదేశ్
2016 తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్
2016 మహారాష్ట్ర మాగ్నెటిక్ మహారాష్ట్ర
2017 ఒడిశా ఉత్కర్ష్ ఒడిశా కాంక్లేవ్
2018 కర్ణాటక ఇన్వెస్ట్ కర్ణాటక, బెంగళూరు టెక్ సమ్మిట్
2019 ఉత్తరప్రదేశ్ యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్
2019 బిహార్ బిహార్ బిజినెస్ కనెక్ట్
2019 రాజస్థాన్ రీసర్జెంట్ రాజస్థాన్, రైజింగ్ రాజస్థాన్
2022 అసోం అడ్వాంటేజ్ అసోం
2025 కేరళ ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్
2025 తెలంగాణ రైజింగ్ విజన్ గ్లోబల్ సమ్మిట్
Read Also: తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన ‘మహింద్రా’
Follow Us On : Facebook


