కలం, వెబ్ డెస్క్: కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్‌ను ముమ్మరం చేస్తుండటంతో మావోయిస్టులు భారీగా సరెండర్ అవుతున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న బర్సె దేవా (Barse Deva) మరికొద్దిసేపట్లో (శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు) తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోనున్నారు. ఆయనతో పాటు సీనియర్ నేత కంకణాల రాజిరెడ్డి (Raji Reddy) కూడా లొంగిపోనున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వీరిద్దరితో పాటు మొత్తం దాదాపు 20 మంది మావోయిస్టులు (Maoist Cadres) లొంగిపోనున్నట్లు సమాచారం. చత్తీస్‌గఢ్‌లో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో సరిహద్దు గుండా తెలంగాణలొోకి కొన్ని వారాల క్రితమే దేవా సహా ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మావోయిస్టు పార్టీ సభ్యులు వచ్చినట్లు రాష్ట్ర పోలీసులకు సమాచారం అందింది.
ఆయుధాలతో సహా లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక లొంగిపోవడానికే వారు సిద్ధమైనట్లు పోలీసు వర్గాల సమాచారం. మరికాసేపట్లో సరెండర్ ప్రక్రియ లాంఛనంగా ముగియనున్నది.
దేవా మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ఆర్మీ చీఫ్ (1వ బెటాలియన్)గా వ్యవహరిస్తున్నారు. దేవా తన దగ్గర ఉన్న రూ. 20 లక్షలను స్టేట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB)కి అప్పగించారు. దీంతో తెలంగాణ పోలీస్ శాఖ ఎస్ఐబీ విభాగాన్ని ప్రశంసించింది. లొంగిపోతున్న మావోయిస్టులు వారితో పాటు ఉన్న సుమారు 48 ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించనున్నారు. ఈ ఆయుధాల్లో ఎల్ఎంజీ (లైట్ మెషిన్ గన్ – LMG)తో పాటు ఏకే-47 (AK-47), ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, .303 తుపాకులు ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత తెలంగాణలో ఇంత భారీ స్థాయిలో ఆయుధాలతో సహా లొంగిపోవడం ఇదే మొదటిసారి అని పోలీసులు తెలిపారు. డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) నేతృత్వంలో అతి పెద్ద లొంగుబాటుగా అభివర్ణిస్తున్నారు.

Read Also: కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
Follow Us On: X(Twitter)


