చిన్నారుల సమస్యలపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

కలం, నిజామాబాద్ బ్యూరో : బాలల హక్కుల వారోత్సవంను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం ప్రత్యేకంగా నిర్వహించిన బాలల ప్రజావాణి (Childrens Prajavani) కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిన్నారులు విద్య, వైద్యం, రవాణా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి, ఇతర సంబంధిత శాఖల అధికారులకు తమ సమస్యలను వివరిస్తూ అర్జీలు అందజేశారు.

బాలలకు సంబంధించిన 18 ఫిర్యాదులు (18 Complaints) అందగా, వాటిలో చాలా వరకు అర్జీలను కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించారు. బాలలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ప్రజావాణి కాన్ఫరెన్స్ హాల్‌లో చిన్నారుల కోసం ప్రత్యేక డెస్క్ లను ఏర్పాటు చేసి, వారి నుండి వినతులు స్వీకరించేలా అధికారులను నియమించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, విద్యా సదుపాయాలను బాలలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. బాల్య వివాహాల నిరోధానికి అంకిత భావంతో కృషి చేయాలని, బడి ఈడు బాలలందరూ విద్యను అభ్యసించేలా చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భుజంగరావు, రాజా గౌడ్, ట్రైనీ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇంచార్జి డీఈఓ సాయాగౌడ్, జిల్లా సంక్షేమ అధికారిణి సౌందర్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ జోష్న తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>