కలం, ఖమ్మం బ్యూరో: మనిషికి నూరేళ్ల ఆయుష్షు.. పశువులైతే ఓ పాతికేళ్లు.. విశ్వాసానికి మారుపేరైన కుక్కల జీవితకాలం మహా అయితే ఒక 15 ఏళ్లు. కానీ, కోడి ఆయుష్షు ఎంత? మహా అయితే ఐదు లేదా ఆరేళ్లు. కానీ, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో మాత్రం ఒక కోడి పుంజు ఏకంగా 16 ఏళ్లుగా జీవిస్తూ.. రికార్డులను తిరగరాస్తోంది.
చుంచుపల్లి మండలం, విద్యానగర్ కాలనీలో నివసించే ప్రవీణ్ అనే వ్యక్తి ఇంట్లోనే ఈ వింత జరిగింది. ప్రవీణ్ కుటుంబం 16 ఏళ్ల క్రితం ఒక కోడిపిల్లను తెచ్చుకుని, దానికి ఎంతో ప్రేమగా ‘టీంకు’ అని పేరు పెట్టుకున్నారు. ప్రవీణ్ కూతురికి రెండేళ్లు ఉన్నప్పుడు ఈ టీంకు వాళ్ల ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 18 ఏళ్లు.. అంటే మన టీంకు వయసు అక్షరాలా 16 ఏళ్లు! సాధారణంగా ఈ వయసులో కోళ్లు ఉండటం దాదాపు అసాధ్యం. కానీ, ప్రవీణ్ కుటుంబం చూపించిన ప్రేమే దానికి అంత ఆయుష్షును ఇచ్చిందేమో!
దీని రేంజే వేరు.. తిండి, లైఫ్ స్టైల్ అంతా లగ్జరీ!
ఇంట్లో పెంపుడు జంతువులా కాకుండా, కుటుంబంలో ఒకరిగా మెలిగే టీంకు లైఫ్ స్టైల్ చూస్తే ముచ్చటేస్తుంది. సాదాసీదా కోళ్లలా ఇది ఏది పడితే అది తినదు. దీనికి సజ్జలు, ద్రాక్ష, దానిమ్మ పండ్లు అంటే మహా ఇష్టం. ఎంతో ఇష్టంగా వీటన్నింటినీ ఆరగిస్తుంది. అలాగే ఎండకాలం వచ్చిందంటే చాలు.. టీంకుకు వేడి అస్సలు పడదు. హాయిగా కూలర్ గాలి కింద కూర్చొని సేదతీరుతుంది. కూలర్ ఆఫ్ చేస్తే తప్ప అక్కడి నుంచి కదలదు. “మా అమ్మాయితో పాటే ఈ టీంకు కూడా పెరిగింది. మా కుటుంబంలో ఇదొక మెంబర్ గా మారిపోయింది. 16 ఏళ్లుగా మా ఇంట్లోనే ఉంటూ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది” అని ప్రవీణ్ గర్వంగా చెబుతున్నారు.
ప్రకృతి నియమాలను సైతం పక్కనబెట్టి, కేవలం ప్రేమతో ఇంతకాలం జీవిస్తున్న ఈ ‘టీంకు’ గాడి కథ ఇప్పుడు స్థానికంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కోళ్లకు కూడా ఇంత ఆయుష్షు ఉంటుందా అని చూసేందుకు చుట్టుపక్కల జనాలు ప్రవీణ్ ఇంటికి క్యూ కడుతున్నారు. నిజంగానే టీంకు.. నువ్వు తోపు బాసూ!
Read Also: తెలంగాణకు పద్మ అవార్డులు.. ఎనిమిది మంది ఎంపిక
Read Also: ఆమెకు రక్షణేది..?

