కలం, వెబ్ డెస్క్: కరీంనగర్‌లోని (Karimnagar) కిసాన్ నగర్ ఆర్‌బీఎల్ బ్యాంకు శాఖలో సుమారు 130 కోట్ల రూపాయల భారీ కుంభకోణం వెలుగుచూడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బ్యాంకులో నకిలీ ఖాతాలను సృష్టించి, మ్యూల్ అకౌంట్ల ద్వారా పెద్ద మొత్తంలో నిధులను మళ్లించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ వ్యవహారంలో భారీగా సైబర్ నేరాలు, హవాలా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌బీఎల్ (RBL) బ్రాంచ్ మేనేజర్‌తో పాటు పలువురు బ్యాంకు ఉద్యోగులను, మరికొందరు మధ్యవర్తులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు కొందరు రాజకీయ నాయకులు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం మ్యూల్ ఖాతాల (Mule Accounts) ముఠాలు బ్యాంకింగ్ వ్యవస్థను, సామాన్యులను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని అమాయకులను, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు, స్వల్ప కమీషన్ల ఆశ చూపి వారి పేరిట బ్యాంక్ ఖాతాలను తెరిపిస్తున్నారు. ఆపై ఈ ఖాతాలను అంతర్జాతీయ సైబర్ మోసాలకు, హవాలా లావాదేవీలకు, అక్రమ నిధుల మళ్లింపునకు వాడుకుంటున్నాయి. కరీంనగర్ ఆర్‌బీఎల్ (RBL) బ్యాంకు ఉదంతం వంటివి ఈ నెట్‌వర్క్ ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టం చేస్తున్నాయి.
Read Also: ఇరాన్ మీదకు 850 మిస్సైళ్లు వదిలిన అమెరికా
Follow Us On: Facebook

