కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తోందని పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. కొమరం భీం ఆశయాలకు అనుగుణంగా పేదలు, ఆదివాసీలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఇళ్లు మంజూరు చేయడంతో ఆదివాసీ కుటుంబాల్లో ఆనందం నెలకొంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని.. ఉచిత కరెంట్ ఇస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలకు అందించే రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెండవవిడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం, ఉపాధి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని కొనియాడారు. రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, అర్హులందరికీ పెన్షన్లు, కార్మికులకు కనీస వేతనాల పెంపు వంటి నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. అలాగే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, సింగరేణి విస్తరణ ద్వారా వేలాది ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

