అమెరికాలో యూ వీసా ఫ్రాడ్.. 10 మంది భార‌తీయుల‌పై కేసు!

క‌లం, వెబ్ డెస్క్‌: అమెరికాలో యూ వీసా (US U Visa) పొందేందుకు న‌కిలీ దోపిడీలు సృష్టించిన వ్య‌వ‌హారంలో ప‌ది మంది భార‌తీయుల‌పై బోస్ట‌న్‌లోని ఫెడ‌ర‌ల్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు న‌మోదు చేసింది. ఈ ప‌దిమంది గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన వార‌ని స‌మాచారం. తీవ్రమైన నేరాలకు గురై, పోలీసు దర్యాప్తులో సహకరించే బాధితులకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే యూ వీసాను అక్రమ మార్గంలో సంపాదించడమే లక్ష్యంగా వీరు ఈ కుట్రలకు పాల్పడ్డారు. ఇందుకోసం కిరాణా దుకాణాలు, మద్యం షాపులు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో నకిలీ దోపిడీలు జరిగేలా ప్లాన్ చేశారు.

ఈ కుట్రలో భాగంగా ఒక వ్యక్తి నకిలీ తుపాకీతో స్టోర్ సిబ్బందిని బెదిరిస్తున్నట్లు సీసీటీవీ కెమెరాల ముందు నాటకం ఆడ‌తాడు. ఈ దాడులు నిజమని నమ్మించేందుకు నగదును కూడా దొంగిలించే వారు. ఈ బాధిత జాబితాలో తమ పేర్లు ఉండేలా నిర్వాహకులకు నిందితులు భారీగా డబ్బు చెల్లించినట్లు విచారణలో తేలింది. తద్వారా తాము నేరానికి గురయ్యామని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ ఆధారాలతో ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునేవారు. గతేడాది దోషులుగా తేలిన రాంభాయ్ పటేల్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో జితేంద్రకుమార్ పటేల్, మహేష్‌కుమార్ పటేల్, సంజయ్‌కుమార్ పటేల్ సహా మొత్తం 10 మంది ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తుండగా, ఇద్దరు ఇమ్మిగ్రేషన్ కస్టడీలో ఉన్నారు. ఈ నేరం రుజువైతే వీరికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, సుమారు 2.5 లక్షల డాలర్ల జరిమానాతో పాటు, శిక్షా కాలం పూర్తయ్యాక దేశం నుండి బహిష్కరించే అవకాశం ఉంది. వేగంగా వీసాలు పొందేందుకు ఇలాంటి అడ్డదారులు తొక్కడంపై అమెరికా అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>