కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ (IPL) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. 35 ఏళ్ల వయసులో తన ఫిట్‌నెస్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా, గత ఆరు నెలలుగా ఆయన మద్యానికి పూర్తిగా దూరమయ్యారు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. గతంలో పార్టీలంటే ఎంతో ఇష్టపడే చాహల్, ఇప్పుడు టీ, మసాలా టీలతోనే కాలక్షేపం చేస్తున్నారు. తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులే ఈ మార్పుకు కారణమని ఆయన వెల్లడించారు. 2025లో ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత, చాహల్ తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జైటీ , ఆత్మహత్య ఆలోచనలతో పోరాడారు. ఆ కఠిన సమయంలో మద్యం వ్యసనం ఒక వ్యాధి వంటిదని గుర్తించిన ఆయన, దానికి స్వస్తి పలికి మానసిక ప్రశాంతతను పొందారు.
ఈ మార్పుపై దక్షిణాఫ్రికా (South Africa) దిగ్గజం ఏబీ డివిలియర్స్ షోలో చాహల్ (Yuzvendra Chahal) ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఉన్నానని, జట్టు కోసం 150 శాతం కష్టపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఐపీఎల్‌లో ఒక సీనియర్ ప్లేయర్‌గా తనను చూసి యువకులు నేర్చుకోవాలనేదే తన తాపత్రయమని ఆయన పేర్కొన్నారు. గత నాలుగు నెలలుగా జీవిస్తున్న జీవితమే అసలైనదని, ఇది తనకు ఎంతో క్లారిటీని ఇచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉన్న ఆ జట్టుకు, చాహల్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. వ్యక్తిగత బాధలను అధిగమించి, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టిన చాహల్ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. రాబోయే సీజన్‌లో చాహల్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
Read Also: అనుష్క పెళ్లి వార్తలు.. పర్సనల్ టీం సంచలన ప్రకటన!
Follow Us On: X(Twitter)

