కలం, ఖమ్మం బ్యూరో : ఉగాది పండుగ సందర్భంగా ఖమ్మం (Khammam) జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి అభివృద్ధి కల నిజం కానుంది. జిల్లా రవాణా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చొరవతో జిల్లాలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణకు రూ.594 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో ముఖ్య మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో అనుసంధానిస్తూ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నారు.
రహదారుల విస్తరణ ఇలా
1. వైరా నుండి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. జగ్గయ్యపేట, బోనకల్, రావినూతల, ముజఫర్ నగర్, జానకీపురం, పెద్దబీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తాండా, సోమవరం మీదుగా వైరా వరకు మొత్తం 25.2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.151.20 కోట్ల నిధుల మంజూరు చేశారు.
2. మధిర నుంచి తూటికుంట్ల వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. మధిర, జిలుగుమాడు, ఆత్కూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్మణ పల్లి మీదుగా తూటికుంట్ల వరకు మొత్తం 13.50 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరణకు రూ. 81 కోట్ల నిధులు మంజూరు చేశారు.
3. మధిర నుంచి ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. మధిర, ఎల్లెందులపాడు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు మొత్తం 18.40 కిలోమీటర్ల మేర ఈ రహదారికి రూ.110.40 కోట్ల నిధులు మంజూరు చేశారు.
4. ఖమ్మం నుంచి బోనకల్ వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. ఖమ్మం, కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు మొత్తంగా 28.03 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరణకు రూ.157.23 కోట్ల నిధుల మంజూరు చేశారు.
5. బోనకల్-ఆళ్లపాడు, రాయన్నపేట-వంగవీడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. బోనకల్, ఆళ్లపాడు, రాయన్న పేట మీదుగా వంగవీడు వరకు మొత్తంగా 15.72 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరణకు రూ.94.32 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే జిల్లా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో ఈ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సౌకర్యవంతమైన రాకపోకలను కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ రహదారుల విస్తరణను ప్రభుత్వం చేపడుతోంది.

