కలం, వెబ్ డెస్క్ : భోగాపురం ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపనపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టింది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. అయితే ఆ రెండు పనులే చంద్రబాబు చేశారని, మధ్యలో మిగిలిన పనులన్నీ తమ అధినేత జగనే చేశారని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా కొబ్బరికాయ, గుమ్మడికాయం కొట్టడానికి సీఎం అవసరం లేదని .. దారిన పోయేవాడు కూడా కొడతాడని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన సింహభాగం పనులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. ఈ విషయం ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం మొదట్నించి అలవాటేనని తెలిపారు. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు.. కుప్పం ఎయిర్‌పోర్ట్ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.

