ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్: భద్రతా దళాల బిగ్ ఆపరేషన్

కలం, వెబ్ డెస్క్ : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్‌ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. ఉధంపుర్‌ (Udhampur) జిల్లాలోని మజల్తా ప్రాంతంలో బుధవారం సాయంత్రం అనుమానాస్పద కదలికలను భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదుల నుంచి కాల్పులు జరగడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు (Udhampur Encounter) ప్రారంభించాయి.

ఇద్దరు ఉగ్రవాదులు మృతి

కొంతసేపు కొనసాగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతుల గుర్తింపు, వారి నేపథ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.

సంయుక్తంగా గాలింపు

ప్రారంభంలో జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు కలిసి ఈ చర్య చేపట్టాయి. కాల్పులు తీవ్రతరం కావడంతో అదనపు బలగాలను మజల్తా ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీసుల స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ సంయుక్తంగా గాలింపు నిర్వహిస్తోంది.

విస్తృతంగా తనిఖీలు

మిగిలిన ఉగ్రవాదుల కోసం డ్రోన్లు, స్నిఫర్‌ డాగ్స్‌, ఇతర నిఘా పరికరాలను రంగంలోకి దించారు. ఉధంపుర్‌-రియాసీ ప్రాంతంలోని కీలక రహదారులపై వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. కొండ ప్రాంతాల్లోనూ భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

భద్రత కట్టుదిట్టం

తాజా ఆపరేషన్‌ నేపథ్యంలో పిర్‌ పంజాల్‌ పరిధిలో భద్రతను మరింత పెంచారు. ఉధంపుర్‌తో పాటు రియాసీ, రాంబన్‌, కథువా, పూంచ్‌, రాజౌరి జిల్లాల్లోని కొండ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల రాజౌరిలో లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్న ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్ల నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించి, సెప్టెంబరు 15న ముగ్గురిని అరెస్టు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>