కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కుటుంబంపై మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని గుంటూరులో వైసీపీ (YSRCP) నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకురాలు నూర్ ఫాతిమా ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు కాపీని అందించారు. జగన్ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఆయన భార్య పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని నాటి సీఎం చంద్రబాబు సరిదిద్దాడని, జగన్‌ను పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించారని లేనిపోని కల్పితాలతో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారని, జగన్ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు వైఎస్ జగన్ దంపతులపై సోషల్ మీడియాలో నీచంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేసినట్లు ఐటీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

