కలం, వెబ్ డెస్క్: డీలిమిటేషన్ (Delimitation) వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దక్షిణాదిలో కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలన్నింటితో పాటు ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిపై సీఎం చంద్రబాబు తన స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని షర్మిల డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదించిన 2011 జనాభా లెక్కల ఆధారిత డీ లిమిటేషన్ ప్రక్రియ రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తోందన్నారు. ఇది ఏపీ రాజకీయ, ఆర్థిక భవిష్యత్తుకు పెను ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఈ ప్రక్రియతో ఏపీ గొంతుతో పాటు, వేల కోట్ల రూపాయల భవిష్యత్ ఆర్థిక అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు డీలిమిటేషన్‌పై బహిరంగంగా వ్యతిరేకత తెలియజేయాలని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు డీ లిమిటేషన్ విషయంలో ఏపీలోని 25 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. ఏపీ అసెంబ్లీలో ఒక రోజు ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశంపై చర్చించాలన్నారు. అసెంబ్లీలో ప్రతిపాదిత డీలిమిటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను తిరస్కరించే తీర్మానం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించాలని డిమాండ్ చేశారు.

