కలం, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంపై జరిగిన దాడిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస సెంటర్ వద్ద పట్టపగలే ఓ వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని షర్మిల విమర్శించారు. నిందితుడికి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతూ తప్పించుకోవాలని చూడటం హేయమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఘటన వెనుక ఉన్న శక్తులు ఎవరో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు సీఎం చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఆమె విమర్శించారు.
కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ధ్వసమైన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. విగ్రహాల రక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నంద్యాలలో అదే సెంటర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని సీఎం చంద్రబాబును ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఏపీ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోస్ట్ చేశారు. మరోవైపు విగ్రహం పై దాడి చేసింది వైసీపీ కార్యకర్త అంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు వైఎస్ జగన్ తన కార్యకర్తలను రంగంలోకి దింపాడని ఆరోపించారు.

