వరల్డ్ కప్ ఫార్మాట్లలో ఐసీసీ కీలక మార్పులు

కలం, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులకు ఐసీసీ (ICC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. పురుషుల వన్డే, టీ20 ప్రపంచకప్‌ల ఫార్మాట్లలో పెద్ద మార్పులకు ఆమోదం తెలిపింది. 2028 టీ20 ప్రపంచకప్‌కు అసోసియేట్ దేశాల అర్హత ప్రక్రియలో కూడా కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు వార్షిక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ మార్పులకు ఆమోదం లభించింది. టోర్నీ ప్రారంభం నుంచే ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం పెరగడం, పోటీ స్థాయి మెరుగుపడడం, ఆటగాళ్లు, అభిమానులకు మెరుగైన అనుభవం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది.

వన్డే ప్రపంచకప్‌లో కొత్త విధానం

వన్డే ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య 14గానే కొనసాగుతుంది. అయితే టోర్నీ నిర్వహణ విధానం పూర్తిగా మారనుంది. మొదట అర్హత సాధించిన 12, 13, 14వ ర్యాంక్ జట్లు ‘సూపర్ సిరీస్’లో రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడతాయి. ఇందులో విజేతగా నిలిచిన జట్టు మిగిలిన 11 జట్లతో కలిసి రెండో దశకు చేరుతుంది. రెండో దశలో 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులోని జట్లు ఒకదానితో ఒకటి ఆడతాయి.

రెండు గ్రూపుల నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు, అలాగే రెండు గ్రూపుల్లో కలిపి తదుపరి అత్యుత్తమ జట్టు కలిసి ‘సూపర్ 7’కు అర్హత సాధిస్తాయి. సూపర్ 7లో అన్ని జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఇందులో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. మొదటి జట్టు నాలుగో జట్టుతో, రెండో జట్టు మూడో జట్టుతో పోటీ పడతాయి. విజేతలు ఫైనల్‌లో తలపడతారు.

టీ20 ప్రపంచకప్‌లో మార్పులు

20 జట్లతో జరిగే టీ20 ప్రపంచకప్‌లో కూడా కొత్త ఫార్మాట్ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఉన్న ఐదు జట్లతో నాలుగు గ్రూపుల విధానానికి బదులుగా, నాలుగు జట్లతో ఐదు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి తొలి రెండు జట్లు తదుపరి దశకు చేరతాయి. ఇప్పటి సూపర్-8 స్థానంలో ‘సూపర్-10’ ఉంటుంది. ఇందులో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు వెళ్తుంది.

గ్రూపుల్లో రెండో స్థానంలో నిలిచిన జట్లు, మరో గ్రూపులో మూడో స్థానంలో ఉన్న జట్లతో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడతాయి. ఆ రెండు మ్యాచ్‌ల విజేతలు కూడా సెమీఫైనల్‌కు చేరతారు. ఈ మార్పులతో రెండో దశలో ఆడే జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పది వరకు పెరుగుతుందని, ఎదుగుతున్న జట్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఐసీసీ (ICC) వెల్లడించింది.

2028 టీ20 ప్రపంచకప్ అర్హత విధానం

2028 టీ20 ప్రపంచకప్ అర్హత ప్రక్రియకు కూడా ఐసీసీ ఆమోదం తెలిపింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొని నేరుగా అర్హత సాధించని జట్లు గ్లోబల్ క్వాలిఫయర్‌కు నేరుగా వెళ్తాయి. స్కాట్లాండ్‌కు ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యూరప్ రీజినల్ ఫైనల్‌కు నేరుగా అవకాశం కల్పించారు. మిగిలిన ఎనిమిది గ్లోబల్ క్వాలిఫయర్ స్థానాలను ప్రాంతాల వారీగా కేటాయించారు. ఆఫ్రికా, ఆసియా, యూరప్‌కు చెరో రెండు స్థానాలు, అమెరికాస్‌, ఈస్ట్ ఏషియా-పసిఫిక్ ప్రాంతాలకు చెరో ఒక స్థానం ఇవ్వనున్నారు.

గ్లోబల్ క్వాలిఫయర్‌లో ప్రతి ప్రాంతం నుంచి అత్యుత్తమ జట్టుతో పాటు, మొత్తం ప్రదర్శన ఆధారంగా మరో మూడు జట్లు కనీస అర్హత ప్రమాణాల ప్రకారం 2028 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మార్పులతో ప్రపంచకప్‌లలో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అలాగే కొత్త జట్లకు పెద్ద వేదికపై ఆడే అవకాశాలు కూడా పెరగనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>