కలం, వెబ్‌డెస్క్: రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి పిడేల్ వాయించినట్లు ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక తుఫాన్ రాబోతుంటే ప్రధాని ఇటలీలో చాక్లెట్లు పంచడం హాస్యాస్పదమని షర్మిల వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారంతో పేద, మధ్య తరగతి ప్రజలు, మహిళలు, రైతులు విలవిలలాడుతుంటే.. ప్రధానికి మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం కంటే నాటకాలు, విదేశాల్లో రీల్స్ చేసుకోవడంపైనే ఎక్కువ పిచ్చి ఉందని ఆమె మండిపడ్డారు. మోదీ మెలోడీ ఈ దశాబ్దపు అత్యుత్తమ కామెడీ అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అంతర్జాతీయంగా అత్యంత దారుణమైన పరిస్థితులు ఏర్పడి, రూపాయి విలువ రోజురోజుకూ దిగజారిపోతున్న సమయంలో ప్రధాని స్థాయి మరిచి విదేశాల్లో రీల్స్ కోసం జల్సాలు చేసుకోవడం సిగ్గుచేటని షర్మిల మండిపడ్డారు. దేశంలో పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని, మత ఘర్షణలతో ప్రజలు బతుకులు చీకటవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయులకు భరోసా కల్పించాల్సిన ప్రధాని మోదీ ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంటే , ఇక్కడ ఆయన చెంచా గ్యాంగ్ , బీజేపీ నేతలు మెలోడీ చాక్లెట్లు పంచుకుంటూ చప్పట్లు కొట్టడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇక ప్రధాని మోదీ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దొంగ పనులని షర్మిల విమర్శించారు. సామాన్య ప్రజలను బంగారం కొనొద్దని, బయట తిరగొద్దని, ఇంధనం పొదుపు చేయాలని, ఇళ్ల నుంచే పని చేయాలని నీతి సూత్రాలు చెప్పే ప్రధానికి ఆ సూత్రాలను ఆచరించాలనే శ్రద్ధ లేకపోవడం బాధాకరమన్నారు. దేశ ప్రజలపై ధరల భారం పెంచి, రైతులు, యువత ఏడుస్తుంటే … విదేశాల్లో నవ్వుతూ కాలక్షేపం చేయడం మోదీ అనాలోచిన నాయకత్వానికి నిదర్శనమన్నారు. ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తన దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

