కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజల సౌకర్యమే లక్ష్యంగా అత్యాధునికంగా మార్కెట్ అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 58వ డివిజన్‌లో రూ.5.02 కోట్లతో నిర్మించిన అధునాతన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ.20 కోట్లతో భూమిపూజ చేశారు.
విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ కాలేజీ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. మార్కెట్‌లో దుకాణాల అలైన్‌మెంట్, కేటాయింపులను త్వరలో పూర్తి చేసి ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యాపారుల కోసం ప్రత్యేకంగా మంచినీటి ప్లాంట్, రిఫ్రిజిరేటర్, నీటి డబ్బాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్తులో టాయిలెట్లు, విశ్రాంతి గదులు తదితర సౌకర్యాలను కూడా కల్పిస్తామని చెప్పారు.
తైబజార్ రద్దుతో వ్యాపారులకు లాభం..
ఎన్నికల హామీ మేరకు తైబజార్ రద్దు చేసినట్లు విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. దీంతో నగరంలోని వేలాది మంది చిన్న వ్యాపారులకు ఆర్థిక భారం తగ్గిందన్నారు. తైబజార్ రద్దు కావడంతో వ్యాపారులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. రోడ్డుపై వ్యాపారాలు నిర్వహించడం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, ఇకపై ఎవరూ రోడ్డుపై కూర్చొని వ్యాపారం చేయరాదని స్పష్టం చేశారు. మార్కెట్‌లోనే వ్యాపారులకు అనువైన ఏర్పాట్లు చేస్తామన్నారు.
మార్కెట్‌లో వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని విప్ యెన్నం సూచించారు. వ్యాపారులు తమ సమస్యలను స్థానిక కార్పొరేటర్, మేయర్, డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకురావాలన్నారు. మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, 58వ డివిజన్ కార్పొరేటర్ ఎం అనురాధ, చిన్న, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

