కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయంలోని క్యూ లైన్లు, ప్రధాన ప్రసాద విక్రయ కేంద్రాలు, వ్రత మండపాలు, కొండపై పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ధర్మదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లలో తాగునీటి సదుపాయం, క్రమబద్ధమైన రాకపోకలు, ప్రసాద పంపిణీ తదితర అంశాలపై ఆలయ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగించారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనంతో పాటు వ్రతాలు, ప్రసాదాల కోసం ఆలయ పరిసరాల్లో వేచి ఉన్నారు.
రద్దీ నేపథ్యంలో కొండపై వాహనాల రాకపోకలు కూడా పెరిగాయి. భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ కొనసాగితే క్యూ నిర్వహణతో పాటు ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద అదనపు ఏర్పాట్లు చేపడతామని వెల్లడించారు.

