కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గాంధీ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని (Prisoners Welfare Day) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ & డిస్ట్రిక్ట్ జడ్జి ప్రేమలత ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. జిల్లా ఎస్పీ జానకి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఖైదీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఖైదీలతో అధికారులు మాట్లాడారు.
జిల్లా ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ జడ్జి ప్రేమలత మాట్లాడుతూ.. ఖైదీలు చేసిన తప్పులను పునరావృతం చేయకుండా, జైలు జీవితాన్ని తమలో మార్పు తీసుకురావడానికి ఒక అవకాశంగా భావించాలని సూచించారు. క్రమశిక్షణతో జీవిస్తూ, జైలు నుంచి బయటకు వెళ్లిన అనంతరం సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆమె తెలిపారు. న్యాయపరమైన సహాయం అవసరమైన ఖైదీలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
అనంతరం జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఖైదీల సంక్షేమం, వారి పునరావాసం, సమాజంలో తిరిగి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రారంభించేలా ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. జైలు శిక్ష అనేది జీవితానికి ముగింపు కాదని, తమలో మార్పు తెచ్చుకొని భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకునేందుకు ఒక అవకాశంగా భావించాలని ఖైదీలకు సూచించారు.
ఖైదీలు కూడా తమలో సానుకూల మార్పు తీసుకువచ్చి, భవిష్యత్తులో చట్టాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా జీవించాలని ఎస్పీ ఆకాంక్షించారు. జైలు సిబ్బంది ఖైదీల సంక్షేమం, భద్రతతో పాటు వారి మానసిక, సామాజిక పునరావాసానికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ కాళిదాస్, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ ఇందిరా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు, సిబ్బంది , ఖైదీలు పాల్గొన్నారు.

