కలం, స్పోర్ట్స్: టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచరీలతో విరుచుకుపడుతున్న తీరుపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పశ్చాత్తాపపడుతుంటారని మాజీ భారత క్రికెటర్ సదగోపన్ రమేశ్ (Sadagoppan Ramesh) వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదలైన తన యూట్యూబ్ వీడియోలో రమేష్ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటన సమయంలో రోహిత్ శర్మ భవిష్యత్తుపై అగార్కర్ వ్యతిరేక వైఖరి తీసుకున్నారని ప్రచారం సాగింది. అయితే బీసీసీఐ ఆ కథనాలను ఖండించింది.
ఈ వివాదాలన్నింటికీ రోహిత్ శర్మ తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో 138 పరుగులు చేసిన రోహిత్, ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కూడా మరో వేగవంతమైన సెంచరీ సాధించారు. వచ్చే ఏడాది జరగబోయే ప్రపంచకప్ జట్టులో రోహిత్ ఉండకూడదని అగార్కర్ పట్టుబట్టారని, అందుకే ఆయన కాంట్రాక్ట్ పొడిగింపునకు గురికాలేదని రమేష్ వ్యాఖ్యానించారు. రోహిత్ మాత్రం వయసు అనేది ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారని అన్నారు.
50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి, ఆపై ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి సెంచరీ చేయడం ఆయన మైండ్ సెట్, అత్యుత్తమ ఫిట్‌నెస్‌కు నిదర్శనమని చెప్పారు. రోహిత్ శర్మ స్థానంపై తీసుకున్న నిర్ణయానికి అగార్కర్ ఇప్పుడు కచ్చితంగా బాధపడతారని ఆయన అన్నారు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీని రమేష్ ప్రశంసించారు. ఒకరు సెంచరీ చేస్తే మరొకరు దాన్ని అనుసరిస్తున్నారని, ఇద్దరూ గాయపడిన సింహాల్లా బ్యాటింగ్ చేస్తున్నారని రమేష్ చెప్పారు.

