క్రీడల్లో సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్

కలం యాదగిరిగుట్ట: ఓ వైపు పోలీసుగా పనిచేస్తూనే.. మరో వైపు క్రీడా పోటీల్లో విజయాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు వాసర్ల పావని నాగేందర్. ప్రస్తుతం యాదగిరిగుట్ట (Yadagirigutta)  పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పావని నాగేందర్ బహుముఖ క్రీడాకారిణిగా రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించిన క్రీడా పోటీల్లో మూడు విభాగాల్లో ఆరు మెడల్స్ సాధించారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక..

తండ్రి నాగేంద్ర బాబు జాతీయ స్థాయి అథ్లెట్ క్రీడాకారుడు కావడంతో పావని నాగేందర్ చిన్నప్పటి నుంచే ఆటలపై మక్కువ పెంచుకున్నారు. నాలుగో తరగతిలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా పోటీలకు తొలిసారి ఎంపికయ్యారు. హకీంపేట క్రీడా పాఠశాలలో చదువుకున్న ఆమె ఇప్పటి వరకు 20 అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నారు. ఎంబీఏ చదివిన అనంతరం పోలీస్ కానిస్టేబుల్ కొలువు సాధించారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలు హోరాహోరీగా జరిగాయి. దీనిలో పావని నాగేందర్ కబడ్డీ, షాట్ పుట్, చేయి కుస్తీ పోటీల్లో బంగారు పతకాలు, వాలీబాల్‌లో వెండి పతకం, బ్యాడ్మింటన్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించారు. దీంతో త్వరలో జమ్మూకశ్మీర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కానిస్టేబుల్ పావని నాగేందర్‌ను డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, సీఐ భాస్కర్ తదితరులు అభినందించి, సత్కరించారు.

విధి నిర్వహణలోనూ..

విధి నిర్వహణలోనూ పావని నాగేందర్ సమర్థత చాటుకున్నారు. ఇటీవలే యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలు రూ.27 వేల నగదు, ఆరు తులాల బంగారం పెట్టుకున్న తన హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకుంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పావని నాగేందర్ బ్యాగ్‌ను గమనించి, వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన అనంతరం సదరు మహిళా భక్తురాలికి బ్యాగ్ అందించారు. ఈ సందర్భంగా పావని నాగేందర్ ను ఉన్నతాధికారులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>