కలం, యాదగిరిగుట్ట : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలోని పాతగుట్ట రోడ్డు మార్గంలో ప్రతి షాపు యజమాని, ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పట్టణ సీఐ బి.భాస్కర్ సూచించారు. పాతగుట్ట రోడ్డు మీద ఉన్న దుకాణాదారులకు, చిరువ్యాపారస్థులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పాతగుట్ట రోడ్డు మీద ఉన్న ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను అరికట్టవచ్చన్నారు. ఏదైనా సంఘటనలు జరిగితే నేరస్తులను తేలికగా గుర్తుపట్టవచ్చని వివరించారు. శాంతి భద్రతలను కాపాడడానికి సీసీ కెమెరాలు తప్పనిసరి అని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం సులభమవుతుందని సీఐ తెలిపారు. ప్రజల భద్రతను కాపాడడంలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేరాలు జరిగినప్పుడు దర్యాప్తునకు సీసీ కెమెరాల ఫుటేజీలు ఉపయోగపడుతాయని ఆయన వివరించారు.
ప్రజలు పోలీసులకు సహకరిస్తూ పట్టణ భద్రతను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీసీ కెమెరాల నిర్వహణను సక్రమంగా కొనసాగిస్తే పట్టణంలో శాంతి భద్రతలు మెరుగుపడతాయని సీఐ భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుకాణదారులు, పాతగుట్ట వాసులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: చేస్తే చాలదు.. చెప్పాలి.. ప్రచారంపై సీఎం ఫోకస్
Follow Us On: X(Twitter)

