కలం, కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని కలెక్టరేట్ రోడ్డులో, చింతకుంట చౌరస్తాలో గల ఆమె విగ్రహానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao), బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… రజాకార్ల అణచివేతకు, భూస్వామ్య పెత్తందారీతనానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి ప్రజల్లో, మహిళల్లో గొప్ప చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపిన ధీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆనాడు ఐలమ్మ చూపిన పోరాట పటిమే తదనంతర కాలంలో రజాకార్ల నుంచి విముక్తికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మూలకారకమై నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ యోధులకు సరైన గుర్తింపునిస్తున్న ప్రభుత్వం, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని (Chakali Ilamma Statue) పునఃప్రతిష్టించి ఆమె త్యాగాలకు తగిన గౌరవం అందించాలని డిమాండ్ చేశారు. వచ్చే జయంతి నాటికల్లా ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

