కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను (Adilabad Tourism) సోషల్ మీడియా వేదికగా పూర్తిస్థాయిలో ప్రచారం కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) అన్నారు. శనివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కుంటాల, పొచ్చెర జలపాతాలు, మావల పార్కుతో పాటు కేస్లాపూర్ నాగోబా, జైనథ్, సిరిచల్మ దేవాలయాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఇన్ ఫ్లుయెన్సర్లు రూపొందిస్తున్న రీల్స్, వీడియోలు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మిలియన్ల కొద్దీ వీక్షణలు సాధిస్తూ జిల్లాకు గొప్ప గుర్తింపు తెస్తున్నాయని ప్రశంసించారు. అలాగే, హెరిటేజ్ అండ్ డిజిటల్ లైబ్రరీ మిషన్ ద్వారా ప్రాచీన తాళపత్రాలు, రాజుల కాలం నాటి రాతప్రతులను ఆధునిక సాంకేతికతతో డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నట్లు తెలిపారు.
అనంతరం పర్యటక శాఖ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ నగదు బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ రవీందర్ రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారిని మాధవి, డీఐఈఓ జాదవ్ గణేష్, జిల్లా పర్యాటక అధికారి శాఖ రవికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

