కలం, యాదగిరిగుట్ట : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం (Yadadri Temple)లో సెల్ఫోన్ల వినియోగాన్ని దేవస్థానం అధికారులు పూర్తిగా నిషేధించారు. గతంలో ఈ నిబంధన ఉన్నప్పటికీ సజావుగా అమలు కాకపోవడం, కేవలం సామాన్య భక్తులకే పరిమితం కావడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలయ భద్రతను, పవిత్రతను కాపాడటంతో పాటు మూలవిరాట్టు చిత్రాలు బయటకు లీక్ కాకుండా ఉండేందుకు అధికారులు ఇప్పుడు ఈ నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు.
ఇకపై సామాన్య భక్తులతో పాటు వీవీఐపీలు, ఉన్నతాధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది, అర్చకులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, స్వీపర్లతో సహా ఎవ్వరూ కూడా ప్రధాన ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి లోపలికి సెల్ఫోన్లు తీసుకెళ్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో భవానీ శంకర్ హెచ్చరించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలయ భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
పక్కనపడేసిన స్కానింగ్ యంత్రం..
ఇదిలా ఉండగా, ఆలయంలో భద్రతా ఏర్పాట్లపై స్థానికులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. వీఐపీలు వెళ్లే లిఫ్ట్ మార్గంలో లగేజీ భద్రతా తనిఖీల కోసం ఏర్పాటు చేసిన వెహంత్ టెక్నాలజీస్ ఎక్స్-రే సామాను తనిఖీ యంత్రం ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉంది. మోటారుతో నడిచే రోలర్ కన్వేయర్ బెల్ట్, అత్యవసర స్టాప్ బటన్లు, కార్యాచరణ స్థితి సూచిక లైట్ల వంటి అత్యాధునిక కీలకమైన భద్రతా భాగాలు కలిగిన ఈ స్కానింగ్ యంత్రాన్ని పక్కన పెట్టేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కీలకమైన యంత్రాలను మూలన పడేసి, భద్రతను ఏ విధంగా కట్టుదిట్టం చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ సరికొత్త ఆంక్షలు కూడా “మూడు రోజుల ముచ్చట” గానే మిగిలిపోతాయా? లేదా అధికారులు నిజంగానే కఠినంగా అమలు చేస్తారా? అనేది వేచి చూడాలి.

