కలం, యాదాద్రి భువనగిరి జిల్లా: వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం (Yadadri Temple) భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు దినం కూడా తోడవడంతో యాదగిరిగుట్టకు రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు. దీంతో కొండపైన, కింద ఉన్న సత్రాలు, వీధులన్నీ భక్తజనసంద్రంగా మారాయి. భక్తుల తాకిడి అనూహ్యంగా పెరగడంతో స్వామివారి దర్శనానికి భారీ సమయం పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ధర్మ దర్శనానికి (ఉచిత దర్శనం) దాదాపు 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటల పైనే సమయం పడుతోంది. ఎండల తీవ్రతను సైతం లెక్కచేయకుండా భక్తులు క్యూలైన్లలో ఓపికగా వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
భక్తులు భారీగా సొంత వాహనాల్లో తరలిరావడంతో కొండపైన ఉన్న బస్ స్టాండ్ ప్రాంతం, పార్కింగ్ స్థలాలు వాహనాలతో పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఆలయ మాడ వీధులు, క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్ల వద్ద ఎటు చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. కొండపైన మాత్రమే కాకుండా, కొండ కింద ఉన్న పాతగుట్ట పరిసరాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. కొత్తగా పెళ్లయిన జంటలు, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తున్నారు. వేసవి సెలవుల చివరి వారాంతం కావడంతో ఈ స్థాయిలో రద్దీ ఉంటుందని అధికారులు ముందే అంచనా వేసినప్పటికీ, భక్తుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ప్రసాద కౌంటర్ల వద్ద ఎలాంటి కొరత లేకుండా ఆలయ ఈఓ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కొండపైకి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.

