కలం, యాదగిరిగుట్ట: తరతరాలుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల సమస్యలు, వారి ఆర్థిక పరిస్థితులు, ఉత్పత్తుల విక్రయాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anurag Jayanthi) దృష్టి సారించారు. చేనేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు, వారు తయారు చేస్తున్న వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించారు.
శుక్రవారం గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన కలెక్టర్.. వర్క్షెడ్లో పనిచేస్తున్న చేనేత కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వస్త్రాల తయారీలో ఎదురవుతున్న ఇబ్బందులు, ముడిసరుకు, ఉత్పత్తుల విక్రయాలు, మార్కెట్లో చేనేత వస్త్రాలకు ఉన్న డిమాండ్, మార్కెటింగ్ సదుపాయాలపై వివరాలు సేకరించారు. కార్మికులు తయారు చేస్తున్న వివిధ రకాల వస్త్రాలను పరిశీలించి, వాటి తయారీ విధానాన్ని తెలుసుకున్నారు.
మగ్గంపై శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా..
చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు మెరుగైన ఆదాయం లభించాలంటే ఉత్పత్తి నాణ్యతతో పాటు విక్రయ అవకాశాలను పెంచడం కీలకమని ఈ సందర్భంగా చర్చించారు. చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించడం, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కార్మికులకు మరింత ఆదాయం సమకూరేలా కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కార్మికుల సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన చర్యలపై కూడా చర్చించారు.
చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుండగా, కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, ఆదాయం లభించేలా చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో చేనేత సహకార సంఘాన్ని సందర్శించి కార్మికులతో ముఖాముఖి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, గుండాల ఎంపీడీవో, తహసీల్దార్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిన్నం ప్రకాష్, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

