కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్లగొండ జిల్లాల మధ్య తలెత్తిన వివాదం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది. అధికార, విపక్ష నేతలు, ఉద్యమకారుల ఒత్తిడి రోజు రోజుకు తీవ్రమవుతోంది. పాలమూరు జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ (Edula Reservoir) నుంచి నీటిని నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకానికి తరలించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన రెండు జిల్లాల మధ్య రాజకీయ, ప్రాంతీయ వివాదానికి దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ కావడంతో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నట్లు చెబుతుండగా.. ఏదుల రిజర్వాయర్ నుంచి ప్రతిరోజూ 1.5 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు, మరో 0.5 టీఎంసీల నీటిని డిండి ఎత్తిపోతల (Dindi project) ద్వారా నల్లగొండ జిల్లాకు తరలించాలని ప్రతిపాదించారు. దీంతో పాలమూరు జిల్లా నీటి అవసరాలు పూర్తిగా తీరకుండానే డిండికి కేటాయింపులు చేయడం ఉమ్మడి మహబూబ్ నగర్ నేతల్లో ఆగ్రహానికి కారణమైంది. మరోవైపు మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఉద్యమం కొనసాగిస్తోంది. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనకుండానే కాంగ్రెస్ నేతలు డిండి ప్రాజెక్టు రద్దు డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నారు.
కరువు జిల్లాకు కేటాయించిన నీటిని తరలించడం అన్యాయమని, ఇది పాలమూరు రైతుల పొట్టకొట్టడమేనని మండిపడుతున్నారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం విపక్షాల ఒత్తిడితోనే ప్రాజెక్టును పక్కన పెట్టిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జేఏసీ పాదయాత్రలోనూ ఆమె పాల్గొని మద్దతు తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి కూడా సీరియస్ గా స్పందించారు. పాలమూరుకు నీళ్లిచ్చిన తర్వాతే డిండి గురించి ఆలోచించాలని, అవసరమైతే మంత్రి వెంకటరెడ్డి కోసం తల నరుక్కుంటానే తప్ప, జిల్లాకు అన్యాయం జరగనివ్వనని ఆయన తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రికి సవాల్ గా మారిన సమస్య
సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డగా డిండి ప్రాజెక్టును ఆపాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సొంత జిల్లాకు అన్యాయం చేస్తే చరిత్ర క్షమించదని హెచ్చరిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లికి వచ్చినప్పుడు పాలమూరు ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలు డిండి ప్రాజెక్టును రద్దు చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఇలా సొంత జిల్లా నేతలు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ప్రశ్నగా మిగిలింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి వంటి వారు బహిరంగంగానే వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
డిండి ప్రాజెక్టు కోసం ఉమ్మడి నల్లగొండ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పట్టుబడుతుండగా మహబూబ్ నగర్ నేతలు అడ్డుకుంటున్నారు. రెండు జిల్లాల నేతల మధ్య సయోధ్య కుదర్చడం సీఎంకు సవాల్‌గా మారింది. మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా జల సాధన సమితి పేరుతో డిండి డి ప్రాజెక్టు రద్దుకు నిరసనలు, సమావేశాలు కొనసాగుతున్నాయి. చలో కలెక్టరేట్, జల దీక్ష వంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా పాలమూరు ప్రాజెక్టు నీటి మళ్లింపు వ్యవహారం రెండు జిల్లాల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది.
మంత్రి ఉత్తమ్‌తో జరిగిన సమీక్షలోనూ..
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో కూడా రెండు జిల్లాల మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం దొరకలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నీరు అందించే ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీళ్లు తీసుకుపోవద్దంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదుల రిజర్వాయర్ ద్వారా డిండికి నీటిని తీసుకువెళ్లకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, జి. మధుసూదన్ రెడ్డి, కూచికుళ్ల రాజేష్ రెడ్డి తదితరులు మంత్రి ఉత్తమ్‌కు విన్నవించారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ ఇరు జిల్లాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా ఆలోచిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
నల్లగొండ నేతల ప్రతివాదన
మరోవైపు నల్లగొండ జిల్లా నేతలు డిండి ప్రాజెక్ట్ ను సమర్థిస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నేత.. రెండు జిల్లాలకు నీరందించడమే లక్ష్యమని, అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచిస్తున్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీరందించే డిండి ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఈ జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు.

