భగ్గుమంటున్న నిత్యావసరాలు.. ధరల మంటతో సామాన్యుడు కుదేల్!

కలం, తెలంగాణ బ్యూరో : “వరి ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని దాటేశాం.. అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ.. దేశానికే అన్నపూర్ణగా మారింది.. ఏటా రెండున్నర కోట్ల టన్నుల దిగుబడి..” ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న మాటలు. కోట్లాది టన్నుల వరి పండిస్తున్నా మార్కెట్‌లో మాత్రం కిలో బియ్యం సెంచరీ మార్క్‌కు చేరువైంది. ఫైన్ క్వాలిటీ బియ్యం ధర వంద దాటింది. 2 నెలల కింద వరకు 50 రూపాయల వరకు ఉంటే ఇప్పుడు 90 రూపాయలకు చేరింది. కందిపప్పు, పెసరపప్పు, శెనగపప్పు, వంట నూనెలు, కూరగాయలు.. ఇలా అన్ని నిత్యావసర వస్తువుల ధరలకు (Essential Commodities Price Rise) రెక్కలొచ్చాయి. సగటు కుటుంబ నెలవారీ బడ్జెట్ అంచనాలు తలకిందులయ్యాయి. ఎల్‌ నినో సాకుతో మార్కెట్ ధరలు గణనీయంగా పెరిగినా వాటి నియంత్రణ, పర్యవేక్షణపై ప్రభుత్వానికి పట్టలేదు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో బీఆర్ఎస్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై అధికార కాంగ్రెస్ తలమునకలయ్యాయి. ప్రజల కోసం ఆందోళనలు చేసే కమ్యూనిస్టు పార్టీలు మౌనంగా ఉండిపోయాయి. రాజకీయ పార్టీలన్నీ ప్రజలను, వారి సమస్యలను గాలికొదిలేశాయి. సామాన్యుల గోడు పట్టించుకునే పార్టీలు, ప్రభుత్వాలు కరువయ్యాయి.

బియ్యం ధరలకు రెక్కలు

వరి ఉత్పత్తిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇప్పుడు దానికి మరో రికార్డు కూడా తోడవుతున్నది. వరి పండే రాష్ట్రంలోనే ధరల మంటలు అనేలా సన్న బియ్యం రేట్లు పెరగడం గమనార్హం. ధాన్యం నిల్వలు పుష్కలంగా ఉన్నా బియ్యం రేటు మాత్రం మోత మోగిస్తున్నది. తెలంగాణలో పండే సన్న రకం వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండడంతో ఎల్‌ నినో సాకుతో అక్కడి నుంచి వస్తున్న వ్యాపారులు కల్లాల దగ్గరే రైతులకు ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూస్తే ఏడాదికంటే ఈసారి బియ్యం రేటు దాదాపు 65% పెరిగింది. సోనా మసూరీ, హెచ్ఎంటీ, జైశ్రీరామ్ లాంటి ఫైన్ క్వాలిటీ వడ్లకు మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడింది. దానికి తగినట్లుగానే బియ్యం ధరలూ పెరుగుతున్నాయి. గతేడాది సన్న వడ్ల ధర క్వింటాల్‌కు రూ.2 వేలు పలికితే ఈసారి రూ.3,500 దాటింది. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ గోదాముల్లో ప్రస్తుతం 9 లక్షల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని, మిల్లర్ల నుంచి దాదాపు 18 లక్షల టన్నులు వస్తాయని తెలిపారు. ఏడాది వరకు ఢోకా లేదని మంత్రి చెప్తున్న టైమ్‌లోనే మార్కెట్ రేటు పెరగడం గమనార్హం.

ఇకపై ధరలు తగ్గే అవకాశాలు తక్కువే..

కరోనా కాలంలో వ్యాపారాల్లేక ఆదాయాన్ని కోల్పోయిన కంపెనీలు ఒక్కసారిగా రేట్లు పెంచేశాయి. ఆ తర్వాత ఆ ధరలే స్టాండర్డ్ అయిపోయాయి. మొన్న ఇరాన్ వార్ పేరుతో వంటగ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలు పెరగడంతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆ తర్వాత అవి అక్కడే సెటిల్ అయిపోయాయి.. తగ్గలేదు. ఇప్పుడు ఎల్‌ నినో పేరుతో మరోసారి నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. చివరకు కూరగాయల ధరలు కూడా ఊహకు అందని తీరులో పెరిగాయి. ఎలాగూ ఎల్‌ నినో పరిస్థితి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగడంతో పాటు తీవ్రం కానున్నది. ఆ తర్వాత సమ్మర్ తోడవుతుంది. జూన్ దాకా వర్షాభావ పరిస్థితులు కంటిన్యూ కానున్నాయి. ఈ కారణాలతో ఇప్పుడు పెరిగిన ధరలు మరింత పెరగడమే తప్ప తగ్గే అవకాశాల్లేవన్నది వ్యాపారుల వాదన. ఇంతకాలం కిలో రూ.52-55 మధ్యన ఉండే ఫైన్ క్వాలిటీ రైస్ (సన్న బియ్యం) ఇప్పుడు రూ.92-95 మధ్య ఉన్నాయి. సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ మార్కెట్‌లో కిలో రూ.102-105 మధ్యన ఉన్నది.

ప్రజలను పట్టించుకోని ప్రభుత్వం, పార్టీలు

మార్కెట్‌లో నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతున్నా వాటిని కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉన్నది. ఎందుకు పెరుగుతున్నాయో, ఎక్కడ అక్రమ నిల్వలు ఉన్నాయో పట్టించుకోవట్లేదు. తనిఖీలూ చేయట్లేదు. ప్రజలకు భరోసా అంతకన్నా లేదు. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ప్రజల బాధల గురించి పట్టింపే లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటు బ్యాంకు పాలిటిక్స్ మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం సామాన్యులకు ధరల నుంచి రిలీఫ్ కలిగించే చర్యలను గాలికొదిలేసింది. ఇక ప్రజల సమస్యలపై గొంతు విప్పే కమ్యూనిస్టు పార్టీలు సైతం ధరల భారం, ద్రవ్యోల్బణం గురించి ఆలోచించట్లేదు. ప్రజల ఓటు బ్యాంకుపై ఆసక్తి చూపే పార్టీలన్నీ కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>