కలం, ఖమ్మం బ్యూరో: అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఖమ్మం (Khammam) నగరానికి చెందిన తెలుగు యువతి నల్లమల అక్షిత (26) (Akshitha Nallamala) గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతి శాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్ కుమార్తె అయిన అక్షిత, ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు.
న్యూయార్క్ సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. తోటి విద్యార్థులు, స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఉన్నత చదువులు చదివి తమ కుటుంబానికి అండగా ఉంటుందని ఎన్నో ఆశలతో అక్షితను విదేశాలకు పంపిన తల్లిదండ్రులు, ఈ అకాల మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఖమ్మం మమతా మెడికల్ కళాశాల రోడ్డులోని వారి నివాసంలో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికా నుండి అక్షిత భౌతిక కాయాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నల్లమల అక్షిత అకాల మరణం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్లమల ఆనంద్‌ను ఫోన్ ద్వారా పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్న వయసులోనే అక్షిత ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుతూ అక్షిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

