కలం, మహబూబ్నగర్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాలు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఎన్ఎంఎంఎస్ ప్రత్యేక శిక్షణ శిబిరాలు (NMMS Training Camps) ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే నిజమైన ప్రజాసేవ అని, వారికి నాణ్యమైన విద్య, సరైన మార్గదర్శకత్వం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం జడ్చర్ల మండలం గొల్లపల్లిలోని శ్రీ లలితాంబికా తపోవనం వద్ద నిర్వహిస్తున్న పది రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరంలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, బోధనా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు. నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, నాలుగేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుందని వివరించారు. ఈ ఏడాది విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధించి మంచి ర్యాంకులు పొందాలని ఆకాంక్షించారు.
శిక్షణ శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన శాకాహార భోజనం అందిస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయుడిగా విద్య ప్రాధాన్యతను గుర్తించిన శ్రీ లలితాంబికా తపోవనం ఆలయ చైర్మన్ భాస్కర్ వంటి నిర్వాహకులు శిబిరం విజయవంతం కావడానికి తమవంతు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. మహబూబ్నగర్ ఫస్ట్ బృందం, వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధులు, పర్యవేక్షకులు, ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పయనీర్ ప్రత్యేక శిక్షణ ద్వారా ప్రయోజనం పొందిన ఓ విద్యార్థిని తల్లిదండ్రులు ఇక్కడ తనను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారని తెలిపారు. తమ కుమార్తె పయనీర్ శిక్షణ ద్వారా అందించిన శిక్షణ లో పాల్గొని ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి, రామోజీ ఫిల్మ్ సిటీలోని కళాశాలలో ప్రవేశం పొంది ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోందని ఆ తల్లిదండ్రులు వివరించినట్లు చెప్పారు. ఈ శిక్షణ శిబిరంలో ఉపాధ్యాయులు చూపిస్తున్న అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉపాధ్యాయుల కృషికి జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, పోలీసు అధికారులు కూడా సహకారం అందించడం అభినందనీయమని తెలిపారు.
విద్యార్థుల అభ్యున్నతి కోసం చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, యువత కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సానుకూలంగా స్పందించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో నిర్వహించిన శిబిరంలో జడ్చర్లకు చెందిన కొందరు అవోపా యువకులు వచ్చి విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడం, వారిని ప్రోత్సహించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలితాంబికా తపోవనం ఆలయ చైర్మన్ భాస్కర్, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ సమన్వయ కర్త రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

