పగిడేరు జియో థర్మల్: భూమి పొరల్లో విద్యుత్!

కలం, ఖమ్మం బ్యూరో: ఎల్ నినో పరిస్థితుల వేళ రాష్ట్రంలో కరెంట్ కోతలు, నాణ్యతలేని విద్యుత్ సరఫరాతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం పగిడేరులోని జియో థర్మల్ వంటి పునరుత్పాదక విద్యుత్ (Geothermal Energy) పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్యపరంగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

గతంలోనే సింగరేణి, ఓఎన్జీసీ కలిసి చేపట్టిన ప్రయోగాల్లో మరింత వేగం పెంచి, భవిష్యత్ లో జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని విస్తరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పగిడేరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభిస్తే.. క్లీన్ ఎనర్జీ లభించడమే కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.

మోటార్లు లేకుండా పైకి నీరు

కొన్ని దశాబ్దాల కింద పగిడేరు దేశం దృష్టిని ఆకర్షించింది. సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాల కోసం పగిడేరులో బోర్లు వేసింది. తద్వారా ఎలాంటి విద్యుత్ మోటార్ల సాయం లేకుండానే భూగర్భం నుంచి పొగలు కక్కుతూ వేడి నీరు ఉబికి వచ్చింది. ఇలా రావడంతో మొదట్లో అధికారులు, స్థానికులు అంతుచిక్కని రహస్యంగా భావించారు. గతంలో వివిధ ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేశాయి. భూమిలోంచి వేడి నీరు రావడం పూర్తిగా ఒక సహజ సిద్ధమైన భౌతిక శాస్త్రీయ ప్రక్రియ అని నిపుణులు స్పష్టం చేశారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వేడి నీరు ఉద్భవించే ప్రదేశాల్లో ఒకటిగా పగిడేరు గుర్తింపు పొందింది.

వేడి నీటి మర్మం ఏంటి?

భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి 32 మీటర్ల లోతుకు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూ అంతర్భాగంలో ఉండే యురేనియం, థోరియం, పొటాషియం వంటి రేడియో ధార్మిక మూలకాలు సంకోచం చెందడం ద్వారా విపరీతమైన వేడి పుట్టి సమీపంలోని నీటి పొరలను వేడి చేస్తుంటాయి. వందల ఏండ్ల కిందటి నుంచి పరిసర ప్రాంతాల్లో 700 చదరపు కిలో మీటర్ల వరకు భూమి అంతర్భాగంలో పగుళ్లు ఉండటం, సమీపంలోని గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం కూడా వేడి నీటి ఉద్భవానికి కారణమని అంచనా వేశారు.

సుమారు 2.5 కిలో మీటర్ల లోతులో వేడి నీరు వచ్చే కేంద్రం ఉండటంతో గట్టి రాతి పొరల మధ్య చిక్కుకున్న నీటిపై తీవ్రమైన సహజ పీడనం ఏర్పడి బోరు వేసినప్పుడు ఏ మోటారు సాయం లేకుండానే నీరు ఉబికి పైకి వస్తుందని పరిశోధకులు గుర్తించారు. బయటకు వచ్చే వేడి నీటి ఉష్ణోగ్రత సుమారు 81 డిగ్రీలు ఉంటే, భూమి లోపల వేడి నీటి ఉష్ణోగ్రత 180-220 డిగ్రీల మధ్యన ఉన్నట్లు తేలింది. ఆ ఉష్ణ జలాల్లో సల్ఫర్, గంధకం వంటి ఖనిజ మూలకాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేశారు.

దేశంలోనే తొలి ప్రయోగం

పగిడేరు ప్రాంతంలోని అపారమైన భూగర్భ ఉష్ణశక్తి ప్రాముఖ్యతను గుర్తించి 2024లో సింగరేణి సంస్థ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన దేశంలోనే తొలి పైలట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్‌ను క్లోజ్డ్– లూప్ బైనరీ ఆర్గానిక్ రాంకిన్ సైకిల్ టెక్నాలజీతో ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తిలో సఫలీకృతమయ్యాయి.

మణుగూరు-పగిడేరు బెల్ట్‌లో సుమారు 3,500 మెగావాట్లకుపైగా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే అపారమైన వనరులు ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఇలా దేశవ్యాప్తంగా గుర్తించిన 381 జియో థర్మల్ ప్రదేశాల్లో పగిడేరు అత్యంత ప్రత్యేకమైందిగా నిలిచింది. అనంతరం జియో థర్మల్ విద్యుత్ తయారు చేసే ప్రయత్నాలు ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నట్టు తెలుస్తున్నది.

పంటలకు రైతులు వినియోగం

స్థానిక రైతులు బయటకు వచ్చే వేడి నీటి తమ వ్యవసాయ పంటలకు పారించుకునేందుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పదుల సంఖ్యలో గిరిజన, ఆదివాసీ కుటుంబాలు నివసించే అక్కడ ఎక్కడైనా బోర్లు వేస్తే వేడి నీరునే పైకి వస్తున్నది. ఆ వేడి నీటిని నేరుగా పంటలకు పారించకుండా, ముందుగా పొలాల్లో పెద్ద పెద్ద గుంతలు తీసి అందులోకి మళ్లించి నిల్వ ఉంచి చల్లారిన తర్వాత పంటలకు వినియోగిస్తున్నారు.

ఒక్క రూపాయి విద్యుత్ ఖర్చు లేకుండా, మోటార్ల అవసరం లేకుండా ఫ్రీగా సాగునీరు అందుతుండటంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేడి నీటి ఊటలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తుండడంతో క్రమంగా పర్యాటక ప్రాంతంగానూ మారింది. భూగర్భ శక్తిని శాస్త్రీయ దృక్పథంతో పూర్తిస్థాయిలో వెలికితీసి, భవిష్యత్ తరాలకు హరిత విద్యుత్‌ను అందించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

భూగర్భ శక్తితో హరిత భవిష్యత్

ఐస్‌లాండ్‌, అమెరికా వంటి దేశాల్లో జియో థర్మల్‌శక్తిని విద్యుత్‌ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ ఈ సాంకేతికతను విస్తరించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి పరిశోధనలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. పగిడేరు వంటి ప్రాంతాల్లో ఉన్న వనరులను శాస్త్రీయంగా అంచనా వేసి, సాధ్యమైన చోట వాణిజ్య ప్రాజెక్టులను ప్రోత్సహిస్తే రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరవచ్చు.

ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పరిశోధనలకు నిధులు కేటాయించడం, సంబంధిత సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం, నిపుణుల బృందాలతో సాధ్యాసాధ్యాలను నిర్ధారించడం కీలకం. భూగర్భంలో దాగి ఉన్న ఉష్ణశక్తిని సమర్థంగా వినియోగించుకోగలిగితే పగిడేరు కేవలం వేడినీటి ఊటల ప్రాంతంగానే కాకుండా స్వచ్ఛమైన విద్యుత్‌ఉత్పత్తి, స్థానిక ఉపాధి, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>