కలం, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో సుమారు 4,000 వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. వీటిలో మంగళవారం వరకు సుమారు 750 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో బుధవారం జిల్లాలో సుమారు 2,000 నుంచి 3,000 వినాయక విగ్రహాలు నిమజ్జనానికి (Ganesh Immersion) తరలివెళ్లనున్నాయి. వీటిలో భువనగిరి డివిజన్ పరిధిలో సుమారు 800, యాదాద్రి సబ్-డివిజన్ పరిధిలో సుమారు 850, చౌటుప్పల్ సబ్-డివిజన్ పరిధిలో సుమారు 1,350 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి.
నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత కోసం బందోబస్తులో అదనపు ఎస్పీలు-02, డీఎస్పీలు-04, ఇన్స్పెక్టర్లు-15, ఎస్సైలు-30, సుమారు 500 మంది లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసు, సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్, స్పెషల్ టీమ్స్, ఉమెన్స్ సేఫ్టీ వింగ్, క్రైమ్ టీమ్స్ అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. పోలీస్ వారికి సహకారంగా ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ, ఎలక్ట్రిసిటీ, తదితర శాఖల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
భువనగిరిలో ప్రత్యేక ఏర్పాట్లు..
భువనగిరి పట్టణంలో గణనాథుని శోభాయాత్ర నిర్వహించనున్నారు. విగ్రహాల నిమజ్జనం భువనగిరి చెరువులో సురక్షితంగా జరిగేలా పోలీసు శాఖతో పాటు మండపాలా నిర్వాహకులు, సంబంధిత శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. అదేవిధంగా జిల్లాలోని ముఖ్యమైన నిమజ్జన ప్రాంతాలైన బీబీనగర్ చెరువు, రాయగిరి చెరువు, యాదగిరిగుట్ట నల్లచెరువు, గోధుమకుంట చెరువు, ఆలేరు సాయిగూడెం చెరువు, రాఘవాపురం చెరువు, వలిగొండ చెరువు, సంగెం భీమలింగం కత్వ, రామన్నపేట తుమ్మలగూడెం చెరువు, చౌటుప్పల్ చిన్నకొండూరు చెరువు, మల్కాపూర్ చెరువు, డి. నాగారం చెరువు, మోత్కూరు చెరువు, పోచంపల్లి చెరువు తదితర ప్రాంతాల్లో వివిధ శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, లైటింగ్, బారికేడింగ్, సీసీటీవీ కెమెరాలు ఇతర అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు నీటిలోకి దిగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు.
ప్రజలకు ముఖ్య సూచనలు
– వినాయక విగ్రహాల ఊరేగింపులను నిర్ణయించిన మార్గాల్లోనే నిర్వహించాలి.
– నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి నీటిలోకి వెళ్లరాదు.
– పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
– మద్యం సేవించి వాహనాలు నడపరాదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకోబడతాయి.
– ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాలపై పరిమితికి మించి వ్యక్తులను ఎక్కించరాదు. వాహనాలపై నిలబడి లేదా ప్రమాదకరంగా ప్రయాణించరాదు.
– ఊరేగింపుల సమయంలో అగ్నిప్రమాదాలకు లేదా ఇతర ప్రమాదాలకు కారణమయ్యే విధంగా బాణసంచా వినియోగించరాదు.
– డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, సమయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలి.
– ఇతర మతాల ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, సున్నిత ప్రాంతాల వద్ద శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా శబ్దం చేయరాదు.
– నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ సిబ్బందికి ప్రజలు సహకరించాలి.
– ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు లేదా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా వెంటనే సమీప పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలి.
– సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మవద్దు, వాటిని ఫార్వర్డ్ చేయవద్దు.
– నిమజ్జన సమయంలో ప్రజలు క్రమశిక్షణ పాటిస్తూ, ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలి.
వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టింది. ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు, నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించి, వినాయక నిమజ్జన వేడుకలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, సురక్షితంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ కోరారు.

