వృద్ధ తాబేలు బ‌తికే ఉంది.. వీడియో విడుద‌ల చేసిన నిర్వాహ‌కులు!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువుగా గిన్నిస్ రికార్డు సృష్టించిన జోనాథన్ (Jonathan) అనే తాబేలు మరణించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను సెయింట్ హెలెనా ప్రభుత్వ యంత్రాంగం కొట్టిపారేసింది. ఏప్రిల్ 1న ఒక నకిలీ ఖాతా ద్వారా జోనాథన్ కన్నుమూసిందని, దానికి నివాళులు అర్పిస్తున్నామని చేసిన పోస్ట్ నెటిజన్లను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఇది కేవలం ప్రజలను మోసం చేసి క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు సేకరించేందుకు చేసిన కుట్ర అని అధికారులు స్పష్టం చేశారు.

జోనాథన్ ఆరోగ్య పరిస్థితిపై సెయింట్ హెలెనా గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జోనాథన్ క్షేమంగా ఉన్నాడ‌ని, సెయింట్ హెలెనాలోని ప్లాంటేషన్ హౌస్‌లో తన ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడ‌ని తెలిపింది. సెయింట్ హెలెనా టూరిజం వారు జోనాథన్ అరటిపండ్లు తింటున్న తాజా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుమారు 193 ఏళ్ల వయస్సు కలిగిన ఈ తాబేలు ఆరోగ్యంగానే ఉందని పశువైద్యులు కూడా ధృవీకరించారు.

ఈ తప్పుడు వార్తపై నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ డబ్బు వసూలు చేయాలనుకోవడం దుర్మార్గపు చర్య అని మండిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జోనాథన్, తప్పుడు వార్తలను పక్కన పెట్టి ఇంకా ఎంతో కాలం జీవించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>