కలం, నిర్మల్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని (World Tourism Day) పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లాలోని యువ టూరిజం క్లబ్ విద్యార్థులకు జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు శనివారం నిర్వహించారు. “డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, జిల్లా టూరిజం నోడల్ అధికారి శ్రీకాంత్ రెడ్డి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు పర్యాటకం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతపై ఆసక్తి పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు. భవిష్యత్తులో పర్యాటక రంగ అభివృద్ధిలో యువత చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

