కలం, నిర్మల్: భైంసా మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ జాదవ్ సంతోష్ కుమార్ (Jadav Santhosh Kumar) రూ. 50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అధికారిపై ఏసీబీ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. కేవలం లంచం తీసుకున్న వ్యవహారానికే పరిమితం కాకుండా.. ఆయన కూడబెట్టిన ఆస్తుల చిట్టాను బయటకు తీసే పనిలో పడ్డారు.
దీంతో సంతోష్ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల వరకు జాదవ్ సంతోష్ నివాసంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ లో ఇటీవలే నిర్మించుకున్న నూతన భవనాన్ని పరిశీలించిన అధికారులు, ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు సమాచారం. సోదాల్లో బంగారం, భూములకు సంబంధించిన పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
జాదవ్ సంతోష్ గతంలో నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో డీఈగా విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏఈగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనతికాలంలోనే భారీ ఆస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో గతంలో అందిన ఫిర్యాదులపైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఆయన పనిచేసిన ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. జాదవ్ సంతోష్‌కు సంబంధించిన రెండు బ్యాంకుల లాకర్లపై దృష్టి సారించినట్లు సమాచారం. బుధవారం లాకర్లను తెరిచి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో మరిన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలు బయటపడే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఒకవైపు రూ. 50 వేల లంచం వ్యవహారం.. మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు, జాదవ్ సంతోష్ వ్యవహారం బైంసా మున్సిపల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సోదాలు, దర్యాప్తు పూర్తయితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే లంచగొండి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

