కలం, రాజన్న సిరిసిల్ల : ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్ సమీపంలోని మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారని మంత్రి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పోలీసు అధికారులు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, భద్రతా చర్యలను ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని మంత్రి ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వాములై ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా సేవలు అందించాలని సూచించారు. సమగ్ర జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రులకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

