కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు చేపట్టింది. వచ్చే నవంబరు నుంచి గ్రౌటింగ్ పనులు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే డిజైన్లను ఖరారు చేశామని.. అక్టోబర్ అయిదో తేదీన సీడబ్ల్యూసీ సమావేశంలో డిజైన్లను ప్రజెంట్ చేస్తామన్నారు. 2027 వర్షాకాలం నాటికే పనులు మొత్తం పూర్తయి బ్యారేజీలు నడిచేలా చూస్తామన్నారు.
నాణ్యత, బ్యారేజీల భద్రతలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రౌటింగ్ ప్రక్రియ పూర్తయితేనే బ్యారేజీల పటిష్టత ఇంకా బలంగా మారుతుందన్నారు. NDSA అభ్యంతరాలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని.. సాంకేతిక అనుమతులు వచ్చాక తుది టెండర్లు పిలుస్తామన్నారు. బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వబోమన్నారు.
అసలేం జరిగిందంటే..
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలోని మూడు పిల్లర్లు 2023 అక్టోబర్ 21న కుంగిపోయాయి. ఈ నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు.. ఈ బ్యారేజీలో నీటిని నిల్వ చేయకుండా.. వచ్చిన వరదను వచ్చినట్లు కిందకు వదిలిపెడుతున్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మేడిగడ్డ బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు రిపేర్లు చేసి, తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తోంది.

