కలం, వెబ్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడా(Noida)లో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు వేతన పెంపు (శాలరీ ఇంక్రిమెంట్) డిమాండ్లపై ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఉద్యోగులు మొదట శాంతియుతంగా నిరసన చేపట్టగా, అనంతరం పరిస్థితి అదుపు తప్పినట్లు సమాచారం. కొంతమంది ఆందోళనకారులు వాహనాలపై దాడులు చేయడం, వాటిని ధ్వంసం చేయడం, అలాగే రాళ్లు రువ్వడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పరిస్థితి అదుపులోకి ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

