కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో మహిళలు వట సావిత్రి వ్రతాన్ని (Vata Savitri Vratham) సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో తెల్లవారుజాము నుంచే మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఆలయాలు, మర్రి చెట్ల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మర్రి వృక్షానికి పవిత్ర దారాలను చుట్టి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
వటసావిత్రి వ్రతం (Vata Savitri Vratham) ద్వారా భర్త ఆయురారోగ్యాలు, మాంగళ్య బలం, కుటుంబ సుఖశాంతులు, పిల్లల క్షేమం కలగాలని మహిళలు ప్రార్థించారు. ఇంటిల్లిపాదులు ఆనందంగా ఉండాలని, కుటుంబాల్లో ఐశ్వర్యం నెలకొనాలని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మర్రి చెట్ల వద్ద మహిళల సందడి కనిపించింది. పూజలు ముగిసిన అనంతరం మహిళలు ఉపవాస దీక్షలను విరమించి ప్రసాదాలు స్వీకరించారు. సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ వ్రతం గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On: Instagram

