కలం, వెబ్ డెస్క్ : మల్కాజిగిరి (Malkajgiri)లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త తుపాకీతో కాల్చి హత్య చేశాడు. బుధవారం ఉదయం జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు.. మల్కాజిగిరి మారుతీనగర్ కు చెందిన అరుణ్ కుమార్ తన భార్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో నిషిత రాణి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, నిషితకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని అరుణ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో గతంలోనే నిషితపై హత్యకు ప్రయత్నించిన అరుణ్ పోలీసులకు చిక్కాడు. ఈ వార్త అప్పట్లోనే వార్తల్లోకి ఎక్కింది.
అయితే, ఆలోచన మారని అరుణ్.. నిషితను ఎలాగైనా అంతమొందించాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మాట్లాడుకుందామని చెప్పి బయటకు పిలిపించాడు. ఈ క్రమంలో మరో వ్యక్తితో కలిసి నిషిత రాణిపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

