కలం, వెబ్ డెస్క్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ (Warangal) జిల్లా పర్వతగురి మండలం సీత్యతండాకు చెందిన మహిళా కానిస్టేబుల్(Woman Constable) అనిత ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే అనిత దూరపు బంధువు నాలుగేళ్లుగా పెళ్లి పేరుతో ఆమెను వేధిస్తూ, డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయమని, ఇతరులతో చనువుగా మాట్లాడవద్దు అంటూ ఒత్తిడి చేశాడు. రాజేందర్ పద్దతి నచ్చని అనిత తల్లిదండ్రులు అతడితో వివాహానికి నిరాకరించారు.
ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, తనను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందని రాజేందర్ గుర్తించాడు. దీంతో జబ్బార్ లాల్‌కు ఫోన్ చేసిన రాజేందర్ అనిత గురించి తప్పుడు సమాచారం ఇచ్చాడు. అప్పటి నుంచి జబ్బార్ లాల్ అనితను వేధించడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని జబ్బార్ లాల్ వేధింపులకు దిగాడు. రాజేందర్‌కు ఫోన్ చేసిన అనిత.. మీ ఇద్దరి వల్ల నా జీవితం నాశనం అయిందని, చావే దిక్కని కన్నీరు పెట్టుకోగా, చస్తే చావు అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీనితో గడ్డి మందు తాగి అనిత ఆత్మహత్యకు పాల్పడింది. దీనితో రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


