కలం, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ (Koilkonda) మండలం చింతల్తండాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తమ్ముడి పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకోవాలనే దురాశతో, ఓ మహిళను ఆమె బావలే అత్యంత కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చింతల్ తండాకు చెందిన కాట్రావత్ బలరాం అనే వ్యక్తికి ఓబ్లాయిపల్లి తండాకు చెందిన కాట్రావత్ సునీత అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు రిషిక, శైలజ అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే బలరాంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో, ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. బలరాం భవిష్యత్తును, పిల్లల బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ఎకరన్నర భూమిని సునీత పేరిట పట్టా చేయించారు.
సునీత పేరిట భూమి బదిలీ చేయడం బలరా అన్నలైన పాండునాయక్, మన్యానాయక్ లకు అస్సలు నచ్చలేదు. ఎలాగైనా ఆ ఎకరన్నర భూమిని తామే స్వాధీనం చేసుకోవాలని పథకం పన్నారు. ఇందులో భాగంగా భార్యాభర్తలను ప్రశాంతంగా కాపురం చేసుకోనివ్వకుండా, బలరాంను తరచూ తమతోపాటు హైదరాబాద్ తీసుకువెళ్లేవారు. వీరి వేధింపులతో విసుగు చెందిన సునీత తన పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పి, నెల రోజుల క్రితమే చింతల్ తండాలో ఆమెకు ఒక ఇల్లు నిర్మించి ఇవ్వగా సునీత అక్కడే ఉంటోంది. అయినా వదలని బావలు.. ఆమె ఇంటికి వెళ్లి భూమిని తమకు రాసిచ్చి, ఇల్లు వదిలి వెళ్లిపోవాలని, లేదంటే చంపేస్తామని పలుమార్లు బెదిరించినట్లు సమాచారం.
ఆమె వారి మాట వినకపోవడంతో నవంబర్ 2వ తేదీన మధ్యాహ్నం సమయంలో పాండునాయక్, మన్యానాయక్ ఇద్దరూ కలిసి.. పాండు భార్య పార్వతి, మామ మాణిఖ్యనాయక్ లతో కలిసి సునీత ఇంటిపైకి వెళ్లారు. గొడవకు దిగి సునీత గొంతుకు పంచె కట్టి, బలవంతంగా వారి ఇంటికి ఈడ్చుకెళ్లారు. అనంతరం అందరూ చూస్తుండగానే కత్తులతో ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ ఘాతుకం జరుగుతున్న సమయంలో బలరాం హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఈ కిరాతక ఘటనపై సునీత తండ్రి వాల్యానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

