కలం, వెబ్ డెస్క్ : హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను పరిరక్షించడంలో భారత నౌకాదళం (Indian Navy) మరొకసారి తన పటిష్టతను నిరూపించుకుంది. సోమాలియా ఈశాన్య తీరంలో సముద్ర దొంగలు హైజాక్ చేసిన ‘అజిని’ అనే చేపల వేట పడవను నేవీ దళాలు కాపాడాయి. ఈ ఉత్కంఠభరితమైన నిరోధక ఆపరేషన్ ద్వారా పడవలో బంధీలుగా ఉన్న 20 మంది సిబ్బందిని ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా రక్షించారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 48 గంటలకు పైగా పక్కా ప్రణాళికతో సాగింది. భారత వైమానిక దళంతో కలిసి నౌకాదళం చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా యుద్ధనౌకలు, సుదూర సముద్ర నిఘా విమానాలను రంగంలోకి దించారు. ఐఏఎఫ్ సీ-17 విమానం సహకారంతో మెరైన్ కమాండోలు (మార్కోస్) ఆపరేషన్‌లో పాల్గొని సోమాలియా దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

