కలం, పాల్వంచ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్న తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగానికి చెందిన ఓ మహిళా కళాకారిణి (Woman Artist) తనకు ఎదురవుతున్న వేధింపులపై జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. పని ప్రదేశంలో మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొంటూ బుధవారం ఫిర్యాదు అందజేశారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి పర్యవేక్షణలో నెలకు 25 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు, పరిసరాల పరిశుభ్రత, మాదకద్రవ్యాల నివారణ వంటి అంశాలపై ఆమె అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే టీమ్ లీడర్ ప్రతి నెలా ఉన్నతాధికారులకు ఇవ్వాలంటూ తన నుంచి రూ.1,000 వసూలు చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కుటుంబంలో వైద్య ఖర్చులు పెరగడంతో ఇటీవల ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయానని తెలిపారు.
దీంతో అక్టోబర్ 2026కు సంబంధించి తనకు రావాల్సిన రూ.32 వేల వేతనంలో రూ.7 వేలు కోత విధించి, రూ.25 వేలు మాత్రమే చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నవంబర్ 24న జూలూరుపాడు మండలం గుండెపూడిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరైనప్పటికీ, తనను గైర్హాజరుగా నమోదు చేశారని ఆరోపించారు.
అంతేకాకుండా కొందరు అధికారులు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కోత విధించిన రూ.7 వేల వేతనాన్ని ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. గుండెపూడి కార్యక్రమానికి సంబంధించిన హాజరును సరిచేయడంతో పాటు, ఫిర్యాదు చేసినందుకు తనపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

