కలం వెబ్ డెస్క్ : భర్త చేసిన అప్పులు తీర్చేందుకు ఓ భార్య దొంగగా మారింది.. చివరికి దొంగతనాలు అలవాటు లేక మొదటి చైన్ స్నాచింగ్(chain snatching)లోనే పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad)లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన అనితారెడ్డి మేడ్చల్ జిల్లాకు చెందిన రాజేష్‌ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అనితా రెడ్డి గతంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండేది. ప్రస్తుతం ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉంటోంది. ఆమె భర్త రాజేష్ గత రెండేళ్లుగా రూ.5 లక్షల అప్పులు చేశాడు. కొన్ని రోజుల నుంచి అప్పుల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. భర్త అప్పులు ఎలాగైనా తీర్చాలని అనితా రెడ్డి నిర్ణయించుకుంది. ఇంత అప్పు తొందరగా తీర్చాలంటే దొంగతనం చేయడమే మార్గమని భావించింది. దీంతో చైన్ స్నాచింగ్(chain snatching) చేద్దామని ప్లాన్ వేసింది. మియాపూర్‌కు చెందిన నల్ల కమల అనే మహిళ లిఫ్ట్‌లో వెళ్తుండగా అనితా రెడ్డి కూడా లిఫ్ట్ ఎక్కింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే కమల మెడలో ఆభరణాలు దొంగలించేందుకు ప్రయత్నించింది. కమల వెంటనే గట్టిగా కేకలు వేసింది. అనితా రెడ్డి తన చేతికి దొరికి అరతులం నల్లపూసల గొలుసుతో పారిపోయింది. దీనిపై కమల సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరగంటలోనే పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.


