కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు(Chittoor) జిల్లా రామకుప్పం (Ramakuppam) మండలంలో జంట ఏనుగులు గత కొన్ని రోజులుగా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ననియాల, జీడిమకులపల్లి, రామాపురం తండా పరిసర గ్రామాలలో సంచరిస్తున్న ఈ ఏనుగులు పంట పొలాలపై దాడి చేస్తూ భారీ నష్టం కలిగిస్తున్నాయి.
గత 15 రోజులుగా ఈ జంట ఏనుగులు అదే ప్రాంతంలో తిరుగుతూ వ్యవసాయ పంటలను ధ్వంసం చేస్తున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు. రాత్రి సమయాలలో పొలాలలోకి ప్రవేశించి వరి, మక్కజొన్న, అరటి వంటి పంటలను నాశనం చేయడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఏనుగుల సంచారంతో గ్రామాలలో భయాందోళన నెలకొంది. పిల్లలు, వృద్ధులు రాత్రి వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితిని గమనిస్తూ ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. తక్షణమే శాశ్వత చర్యలు తీసుకోవాలని, పంట నష్టానికి పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

