కలం, సెంట్రల్ డెస్క్: ఆర్టీసీ సమ్మె (TGSRTC Strike) ముగిసింది. ఇరు పక్షాలూ చెరో మెట్టు దిగడంతో మూడు రోజుల్లోనే పరిష్కారమైంది. గత ప్రభుత్వంలో 52 రోజుల పాటు కొనసాగిన సమ్మె కాలంలో 34 మంది కార్మికులు సూసైడ్ చేసుకున్నారు. కానీ, ఈసారి మూడు రోజుల్లోనే ముగియడంతో కార్మికుల్లో సంతోషం వ్యక్తమైంది. ఇది ఎలా సాధ్యమైందని కొద్దిమంది ఆశ్చర్యపోయారు. చర్చలకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సైతం గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరును పోల్చుకున్నారు. అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఆర్టీసీ సమ్మెపై అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్ చేసిన కామెంట్లను తల్చుకున్న ప్రతినిధులు ఒకింత ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారు. “సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు… యూనియన్ల అతి ప్రవర్తనతోనే సమ్మె.. మోనోపలీతో దురహంకారం ప్రదర్శిస్తున్నాయి.. వారు ఎక్కిన చెట్టుకొమ్మను వారే నరుక్కున్నారు.. భవిష్యత్తులో యూనియనిజం ఉండదు.. అవి వాటి అస్థిత్వాన్ని కోల్పోయినట్లే.. యూనియన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదు”.. ఇలాంటి కామెంట్లతో ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ప్రతినిధులు వాపోయారు.
గత ప్రభుత్వంలో సమ్మెను స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డీల్ చేశారు. అయినా 52 రోజుల పాటు సమ్మె కొనసాగింది. ఈసారి నేరుగా ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోలేదు. మంత్రులు, అధికారుల స్థాయిలోనే కమిటీలు వేసి పరిష్కారం కోసం గైడ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లలో హెచ్చు శాతం గత ప్రభుత్వం నుంచీ కొనసాగుతున్నవే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేండ్లలో కొత్తగా పుట్టుకొచ్చిన డిమాండ్లేవీ లేవు. ప్రభుత్వాలు వ్యవహరించే తీరుతో పరిష్కారంలో వ్యత్యాసాన్ని జేఏసీ గమనించింది.
గత ప్రభుత్వంలో “ఇకపై యూనియనిజం ఉండదు.. యూనియన్లు అస్థిత్వం కోల్పోయాయి..” లాంటి కామెంట్లకు తగ్గట్లుగానే యూనియన్లకు ఎన్నికల్లేవ్.. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్మిక సంఘమూ లేదు. ఇప్పుడు కార్మికులకు ఆ స్వేచ్ఛ లభించింది. గత ప్రభుత్వంలో సమ్మె సందర్భంగా స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లేంటి? ఆ కామెంట్లపై హైకోర్టు రియాక్షన్ ఏంటి? ఇప్పటి ప్రభుత్వం సమ్మెనుఎలా కొలిక్కి తేగలిగింది? వీటిపై కలం స్పెషల్ చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: కవిత వ్యాఖ్యలకు కేసీఆర్ రియాక్షన్‌పై ఉత్కంఠ
Follow Us On : WhatsApp

